వినుకొండ: సాయి డిగ్రీ కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: గులాం రసూల్
వినుకొండలోని సాయి డిగ్రీ కళాశాల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో ముస్లిం సమాజపు సంప్రదాయాలను అవమానపరిచేలా, అసభ్యత కలిగిన అంశాలను చేర్చడం తీవ్రంగా ఖండనీయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...
స్థానిక జిన్నాటవర్ సెంటర్‌లోని గులాం రసూల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థలు విద్యార్థులకు జ్ఞానం, సంస్కారం, నైతిక విలువలు బోధించాల్సిన ప్రదేశాలు కాగా, ఆ ప్రాంగణాన్ని ఒక మత సమాజంపై దూషణకు వేదికగా మార్చడం అత్యంత బాధాకరమని ఆయన విమర్శించారు..
ఈ సందర్భంగా గులాం రసూల్ మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు ఒక్కసారి జరిగి ఆగిపోవడం లేదు. గతంలో గుంటూరు జిల్లాలోని భాష్యం విద్యాసంస్థల్లోనూ ముస్లిం సంప్రదాయాలపై అసభ్యకర ప్రదర్శనలు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ వినుకొండలోని సాయి డిగ్రీ కళాశాలలో అదే విధమైన ఘటన జరగడం ద్వారా యాజమాన్యం యొక్క నిజమైన ఉద్దేశ్యం బయటపడింది. ఇది విద్యార్థుల మధ్య సామాజిక వైరం రగిల్చే ప్రయత్నం, సమాజ శాంతిని భంగపరిచే చర్య్ఙ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక విద్యా సంస్థలో మతానికి వ్యతిరేకంగా ఈ విధమైన కార్యక్రమాలు ప్రోత్సహించడం కేవలం నిర్లజ్జకరమైన చర్య మాత్రమే కాకుండా, దేశ రాజ్యాంగం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛ, మతపరమైన గౌరవానికి విరుద్ధమని గులాం రసూల్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలతో సమాజంలో విభేదాలు పెరిగి, యువతలో విషపూరిత ఆలోచనలకు కారణమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కళాశాల యాజమాన్యం తక్షణమే క్షమాపణ చెప్పి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే విద్యార్థులు, ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా, ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చిన్నచూపు చూడకుండా వెంటనే జోక్యం చేసుకొని, కళాశాల యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యా వాతావరణాన్ని దెబ్బతీసేలా, మతానికి అవమానం కలిగించేలా ప్రవర్తించే వారికి శిక్ష తప్పదనే బోధ కలగాలంటే, సంబంధిత కళాశాలపై కేసు నమోదు చేసి, అవసరమైతే సంస్థ గుర్తింపును రద్దు చేసేంత కఠిన చర్యలు తీసుకోవాల్ఙి అని గులాం రసూల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు...