న్యూస్ రీడ్ (కర్ణాటక): కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న బీజేపీ (BJP)లో అనేక మార్పులు రాబోతున్నాయి. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని నళిన్ కుమార్ కటీల్ చెప్పినట్లు సమాచారం. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి శోభ కరాంద్లజే ను నియమించే అవకాశాలు ఉన్నాయని కొందరు బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు శాసన సభలో ప్రతిపక్ష నేత పదవికి బసవరాజ్ బొమ్మయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర శాఖలో అన్ని స్థాయుల్లోనూ మార్పులు చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. శాసన సభ ఎన్నికల్లో 66 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీ నిలిచింది. అందుకే శాసన సభలో ప్రతిపక్ష నేత పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం సామాజిక వర్గాల సమీకరణాలను బీజేపీ పరిశీలిస్తోంది. ఈ పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు.కర్ణాటక బీజేపీలో మోర్చా స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు మార్పులు తప్పవని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. శాసన సభ ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించిన తర్వాత ఈ మార్పులు జరుగుతాయన్నారు. బలమైన నాయకుడి కోసం అన్వేషణ జరుగుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 25 స్థానాలను గెలిపించగలిగే నేత కోసం అన్వేషణ జరుగుతున్నట్లు తెలిపారు. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
వొక్కళిగ సామాజిక వర్గానికి చెందిన శోభ కరాంద్లజేను కర్ణాటక బీజేపీ అధ్యక్షురాలిగా నియమించడంపై పరిశీలన జరుగుతున్నట్లు తెలిసింది. పార్టీకి లింగాయత్‌ల మద్దతు కొనసాగడం కోసం బసవరాజ్ బొమ్మయ్‌ని శాసన సభలో ప్రతిపక్ష నేత పదవికి ఎంపిక చేయవచ్చునని కొందరు చెప్తున్నారు. ఆయనకు మూడేళ్ళ పరిపాలన అనుభవం ఉన్నందువల్ల శాసన సభలో బీజేపీ వాదనను బలంగా వినిపించగలరని భావిస్తున్నట్లు తెలిపారు.
శాసన సభలో ప్రతిపక్ష నేత పదవి కోసం పోటీపడుతున్నవారిలో ఎస్ సురేశ్ కుమార్, అరవింద్ బెల్లాడ్, వీ సునీల్ కుమార్, బీవై విజయేంద్ర ఉన్నారు. సురేశ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన మాజీ న్యాయ శాఖ మంత్రి. ఆయన అనేకసార్లు రాజాజీ నగర్ నుంచి గెలిచారు. ఆయనకు రాజకీయ పరిణతి బాగా ఉందని, క్రమశిక్షణ, మేధాశక్తి, చిత్తశుద్ధి వంటి మంచి లక్షణాలు ఉన్న నాయకుడని మంచి పేరు ఉంది. అరవింద్ బెల్లాడ్ హుబ్లి-ధార్వాడ్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన లింగాయత్ వర్గానికి చెందినవారు. ఆయన సామాజిక వర్గం, ఆయన నైపుణ్యం, వ్యూహ చతురత వంటివి బీజేపీ కేంద్ర పెద్దల దృష్టిని ఆకర్షించాయి. ప్రభావం చూపగలిగే సామాజిక వర్గం బిల్లవ (ఇండిగ)కు చెందిన వీ సునీల్ కుమార్ కూడా శాసన సభలో ప్రతిపక్ష నేత పదవికి పోటీలో ఉన్నారు. బీజేపీలో చురుకైన నాయకుడిగా పేరు పొందారు. ఆయన గతంలో మంత్రిగా పని చేశారు. బీవై విజయేంద్ర పేరు చర్చలోకి వచ్చినప్పటికీ, ఆయనకు అనుభవం లేకపోవడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
కర్ణాటక బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం!
RELATED ARTICLES