

No.1 Short News
Newsreadరైల్వే ప్రయాణికులకు గమనిక.. నేటి నుంచి వారం రోజుల పాటు 32 రైళ్ల రద్దు
డోర్నకల్-పాపటపల్లి మార్గంలో మూడో రైల్వే లైన్ మరమ్మతు పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఏకంగా 32 రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మార్పులు నేటి నుంచి 18వ తేదీ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
రద్దయిన రైళ్ల జాబితాలో పలు కీలక సర్వీసులు ఉన్నాయి. విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ, పూరి-ఓకా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌తో పాటు డోర్నకల్-కాజీపేట, విజయవాడ-డోర్నకల్ మధ్య నడిచే మెమో ప్యాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి.
రైళ్ల రద్దుతో పాటు కొన్ని ప్రధాన రైళ్లను అధికారులు రీషెడ్యూల్ చేశారు. ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 13, 16, 17 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా బయలుదేరనుంది. అదేవిధంగా, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 15, 16, 18 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా ప్రయాణిస్తాయని తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 14 నుంచి 18 వరకు కాజీపేట-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైలు కేవలం సికింద్రాబాద్-కాజీపేట మధ్య మాత్రమే నడుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
Latest News
11 Oct 2025 10:20 AM