ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే కల్తీ లిక్కర్ దందా: గులాం రసూల్
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే రాష్ట్రంలో అధికారికంగా కల్తీ లిక్కర్ దందా జరుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ తీవ్రంగా విమర్శించారు.
గుంటూరు జిన్నాటవర్ సెంటర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గులాం రసూల్ మాట్లాడుతూ — పుట్టిన పరిశ్రమల్లో కల్తీ లిక్కర్ తయారు చేసి, ఒక్కో ఏరియాకు ఒక్కో నేతను ఎంపిక చేసి బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నారు. తంబళ్లపల్లె వద్ద మొలకలచెరువులో వెలుగుచూసిన కల్తీ లిక్కర్ దందా మంత్రి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని స్పీకర్ తన అనుచరులకు అప్పగించి లిక్కర్ దందాను అధికారికంగా నడిపిస్తున్నారు అని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 70 వేల బెల్ట్ షాపుల ద్వారా ఈ కల్తీ లిక్కర్ పంపిణీ చేసి వచ్చిన ఆదాయాన్ని మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి నివాసమైన కరకట్ట ప్యాలెస్‌కు తరలిస్తున్నారు అని గులాం రసూల్ తెలిపారు.
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 43 వేల బెల్ట్ షాపులను తొలగించగా, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్ట్ షాపులను తిరిగి ప్రవేశపెట్టి వాటి సంఖ్యను 70 వేలకు పెంచారు. అంతేకాకుండా వాటికి పోలీసు రక్షణ ఇవ్వడం ద్వారా ప్రజలను మద్యం వైపు నెడుతున్నారు అని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం నిర్మించిన కల్తీ మద్యం సామ్రాజ్యం రాష్ట్రమంతా విస్తరించింది. ఈ కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న తంబళ్లపల్లెలో జరిగిన ఘటనలో నలుగురు మృతిచెందారు. అక్కడ కల్తీ మద్యం గుట్టురట్టై టిడిపి నాయకుల పాత్ర బహిర్గతమైంది. అయినా పద్ధతి మార్చుకోకుండా టిడిపి నాయకులు తమ తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు.
తమకు అనుకూలమైన వారికి టెండర్లు ఇచ్చి, వారితో మద్యం షాపులు నడిపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ఈ ప్రభుత్వం కేవలం దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడానికే మద్యం విధానాన్ని అమలు చేస్తోంది. ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ లేకుండా ‘మా దేవుడు నిండితే చాలన్నట్లు’ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని గులాం రసూల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
తమ జేబులు నింపుకోవడానికి ఎంతటి నీచ స్థాయికైనా దిగజారిన రాజకీయాలు చేయడానికి సిద్ధపడటం సిగ్గుమాలిన చర్య. కల్తీ లిక్కర్‌తో ప్రజలను దోచుకున్న వారంతా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చట్టం ముందు అందరినీ దోషులుగా నిలబెట్టడం ఖాయమని” గులాం రసూల్ హెచ్చరించారు.