కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురై కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం శివశంకర్ అనే యువకుడు రాంగ్ రూట్‌లో బైక్‌పై రావడమే అని తేలింది.
కర్నూలు సిటీ, ప్రజానగర్‌కు చెందిన శివశంకర్ (బైకర్), అర్థరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో తన పల్సర్ బైక్‌పై హైవేపై రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టాడు. అక్టోబర్ 24 శుక్రవారం శివశంకర్‌కు పెళ్లి చూపులు ఉండగా, అంతకు ముందు రోజు అర్థరాత్రి 20 కిలోమీటర్ల దూరంలోని చిన్నటేకూరుకు అతను ఎందుకు వెళ్ళాడనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
బైక్‌తో ఢీకొట్టిన తర్వాత శివశంకర్ ఎగిరి దూరంగా పడ్డాడు. కానీ బైక్ బస్సు కిందికి వెళ్లి ఇరుక్కుంది. బస్సు సుమారు 300 మీటర్లు బైక్‌ను లాక్కెళ్లడంతో రోడ్డుపై స్పార్క్ (మంట) పుట్టింది. దీనికి తోడు డీజిల్ ట్యాంక్ లీక్ అవడంతో మంటలు భారీగా బస్సుకు అంటుకున్నాయి. ఏసీ బస్సు అద్దాలు మూసి ఉండటంతో, ప్రయాణికులు పొగ, మంటలు కమ్ముకుని ఊపిరాడక 19 మంది సజీవ దహనం అయ్యారు. బైకర్ శివశంకర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.