గుడివాడ హెచ్ డి ఎఫ్ సి బ్యాంకులో నకిలీ గ్రూపులు చూపించి సుమారు 3 కోట్ల రూపాయలను ఆర్పీలు దోచుకున్నారు. 60 నుండి 70 నకిలీ గ్రూపులు తయారు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. పురపాలక సంఘం మెప్మా విభాగంలోని డ్వాక్రా అధికారులు, బ్యాంకు సిబ్బందితో కలిసి ఈ దోపిడీ చేసినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
గుడివాడలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లలోనూ నకిలీ గ్రూపులు ఉన్నట్లు సమాచారం. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేరుతో కొందరు ఆర్పీలు దోపిడిదారులుగా మారి, అధికారులకు లంచాలు ఇచ్చి నకిలీ రుణాలు పొందుతున్నారని తెలుస్తోంది.
ఒకే గ్రూపులో ఇప్పటికే సభ్యులుగా ఉన్న మహిళల పేర్లతో మళ్లీ రుణాలు డ్రా చేస్తున్నట్లు బయటపడింది. కొత్తగా నకిలీ గ్రూపుకి సహకరించే ఒక్కో మహిళకు 10 వేల రూపాయిలు వరకు ఇచ్చి వారి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కావలిసిన డాకుమెంట్స్ సేకరించి నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి లోన్లు కాజేస్తున్నారు. ఇలా ఒక్కో గ్రూపుకి సుమారు 20 లక్షల రూపాయల రుణం తీసుకుంటున్నారని సమాచారం. ఒక వార్డులో నకిలీ గ్రూపు సృష్టించి, అప్పటికే గ్రూపులో ఉన్న మహిళ దగ్గరికి వెళ్లి డ్వాక్రా వ్యక్తిగత రుణం పేరుతో ఆమెతో పాటు మరో ఎనిమిది మంది పేర్లను జోడించి గ్రూపు రిజిస్టర్ చేసింది ఓ ఆర్పీ. ఆ రుణంలో 2 లక్షల రూపాయలు సభ్యులకి ఇచ్చి, మిగతా 18 లక్షలు అర్పీ దోచుకున్నారని సమాచారం. మరొక వార్డులో సమైక్య సొమ్ములు తమ కుటుంబ సభ్యులకు ఇచ్చి, సొమ్ములు అన్ని ఖాళీ చేసి అడిగిన మహిళలకు పంగ నామం పెట్టింది ఓ ఆర్పీ. సాధారణ మహిళల పేదరిక నిర్మూలన పథకం పేరుతో ఆర్పీలు కోట్ల రూపాయల దోపిడీ చేస్తున్నారు. కొన్ని ఏళ్లుగా ఈ నకిలీ గ్రూపుల తంతు కొనసాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని సామాన్య మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంతే కాక సాధారణ రుణానికి గాను ప్రతి మహిళ నుంచి 2 వేల నుండి 4 వేల రూపాయల వరకు లంచం తీసుకుంటున్నారు. కొన్ని వార్డుల్లో సమాఖ్య రుణాలు, శ్రీనిధి రుణాలు రాక ఇబ్బందులు పడుతున్న మహిళలు ఉన్నారు.
ఇతర జిల్లాల్లో మహిళలు సమాఖ్య పొదుపులతో వ్యాపారాలు చేసి అభివృద్ధి చెందుతుండగా, గుడివాడలో మాత్రం దోపిడీ మాయం గాథ కొనసాగుతుంది.
కొంతమంది ఆర్పీలు తప్ప మిగతా వారు అందరూ నకిలీ గ్రూపులు సృష్టించి దోపిడీ చేయడమే ధ్యేయంగా మారింది. లోన్ పెట్టు – లక్షలు కొట్టు అన్న నినాదంలా వ్యవహరిస్తున్నారు.
ఒక్కో ఆర్పీ కింద 25 నుండి 30 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపులో రుణం కోసం 2500 నుండి 4000 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇవ్వకపోతే తరువాత రుణాలు చేయమని బెదిరిస్తున్నారు. ఇది ఒక రకమైన దోపిడీ.
గుడివాడ డ్వాక్రా వ్యవస్థలో నెలకొన్న అవినీతి రొచ్చు అంత లోతైనదని మహిళలు చెబుతున్నారు.
ఈ నకిలీ గ్రూపుల ద్వారా కొల్లగొట్టిన డ్వాక్రా సొమ్ములను సంబంధిత ఆర్పీల వద్ద రికవరీ చేసి, పేద మహిళలకు మళ్లించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.