

No.1 Short News
Newsreadభక్తులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం! - తిరుమలకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు
తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శనార్థం నిత్యం సుమారు 70,000 నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గం, ఘాట్‌రోడ్లు, క్యూలైన్లు తదితర ప్రదేశాల్లో అప్పుడప్పుడు ప్రమాదాలకు గురికావడం, ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడడం, నడక మార్గంలో అడవి జంతువుల దాడి వంటి ఘటనల నేపథ్యంలో భక్తులకు ఇన్సూరెన్స్ కల్పించాలని యోచిస్తున్నారు.
ప్రమాదాలు, జంతువుల దాడిలో మృతిచెందిన వారికి, ఆకస్మిక గుండెపోటుకి బీమాతో చేయూతనందించాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి తిరుమలలో ప్రమాదం బారిన పడి మృతిచెందిన వారికి టీటీడీ 3లక్షల రూపాయల వరకు చెల్లిస్తోంది. ఇప్పుడు అలిపిరి - తిరుమల మధ్య ప్రయాణించే భక్తులకు బీమాను కల్పించాలని చూస్తున్నారు. పెద్దసంఖ్యలో వచ్చే భక్తులకు బీమా కల్పించే సంస్థలు, అవి వసూలు చేసే ప్రీమియం, దాతల సహకారం తదితర అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తిరుమలకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుమల- తిరుపతి మధ్య డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్తు బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 50 ఎలక్ట్రిక్ బస్సులు కనుమదారుల్లో తిరుగుతుండగా, మరో 350 బస్సులు విడతలవారీగా రానున్నాయి. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా స్కీమ్ కింద కేంద్రం రాష్ట్రానికి ఇప్పటికే 750 విద్యుత్తు బస్సులు కేటాయించింది. ఇందులోంచి 50 బస్సులు ‘తిరుమల- తిరుపతి’ కేటాయించారు. ఇవి కాకుండా తిరుమలకు మరో 300 బస్సులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర గృహ, పట్ణణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాయగా, అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చింది.
మొదటి దశలో కేంద్రం ఇచ్చే 50 బస్సులను మంగళం డిపోనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో రానున్న 300 బస్సుల్లో తిరుమల డిపోనకు 150, అలిపిరి డిపోనకు 50, తిరుపతి ఇంట్రా మోడల్ బస్‌స్టేషన్ నిర్మాణంలో భాగంగా కేటాయించే డిపోనకు 50, శ్రీకాళహస్తి- తిరుపతి మధ్య మరో 50 బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో తిరుమలలో 150 ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర సాంకేతిక ఏర్పాట్లకు వీలుగా 5 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇటీవల ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు
Latest News
29 Jun 2025 19:23 PM