

No.1 Short News
Newsreadమరి కాసేపట్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, మెగా డీఎస్సీ - 2025 షెడ్యూల్ ఇదే
అమరావతి, ఏప్రిల్ 20: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం (ఏప్రిల్ 20) విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ షెడ్యూల్‌ను శనివారం (ఏప్రిల్ 19) ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు. కూటమి సర్కార్ మ్యానిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ తన ట్వీట్‌లో వెల్లడించారు. ఇన్నాళ్లు ఓర్పు, పట్టుదలతో ఎదురుచూసిన ఔత్సాహికులందరికీ ఆల్‌ది బెస్ట్ అంటూ లోకేశ్ పోస్టులో పేర్కొన్నారు. చేశారు. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం అంటే.. ఇందుకు సంబంధిత జీవోలు, ఖాళీల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్ వంటి ఇతర వివరాలు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నారు. డీఎస్సీ నేపథ్యంలో అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తాజాగా కూటమి సర్కార్ ఉత్తర్వులు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే.
మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్ ఇదే..
ఆన్‌లైన్ ఫీజుల చెల్లింపులు, దరఖాస్తుల స్వీకరణ తేదీలు: ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు
మాక్ టెస్ట్‌లు: మే 20 నుంచి
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ తేదీ: మే 30 నుంచి
డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు: జూన్ 6 నుంచి జులై 6 వరకు
ప్రాథమిక కీ విడుదల: అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక ‘కీ’ విడుదల
అభ్యంతరాల స్వీకరణ: ఆ తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ
ఫైనల్ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల
మెరిట్ జాబితా: ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు
మెగా డీఎస్సీలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు రెండు కలిపి 14,088 పోస్టులున్నాయి. ఇక రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో జోన్-1లో 400, జోన్-2లో 348, జోన్-3లో 570, జోన్-4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 పోస్టులు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు, జువెనైల్ పాఠశాలల్లో 15 పోస్టులు, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి. ఇతర పూర్తి వివరాలకు https://cse.ap.gov.in లేదా https//apdsc.apcfss.in వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.
Latest News
20 Apr 2025 06:33 AM