ఏపీ లో కలకలం సృష్టించిన నకిలీ ఈ-స్టాంపుల కేసు స్కామ్‌లో-ముగ్గురిపై కేసు
కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన నకిలీ ఈ-స్టాంపుల స్కామ్‌లో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కళ్యాణదుర్గంలో బోయ ఎర్రప్ప నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసి విక్రయించాడని ఎస్పీ తెలిపారు.
నకిలీ ఈ-స్టాంపులు విక్రయించి మోసం చేశారని ఎస్ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ ఏజీఎం సతీష్ బాబు ఫిర్యాదు మేరకు బోయ ఎర్రప్ప, మోహన్‌బాబు, భువనేశ్వర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు. మీసేవ నిర్వహకుడు బోయ ఎర్రప్ప రెండేళ్లుగా 15, 413 స్టాంపులు విక్రయిస్తున్నట్లు నిర్దారించామన్నారు. వీటిలో ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాకు 438 ఈ-స్టాంపులు ఇచ్చారని తెలిపారు. ఈ-స్టాంపుల కోసం బోయ ఎర్రప్ప బ్యాంకు ఖాతాకు ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా రూ.32 లక్షలు బదిలీ చేయగా, అందులో రూ.25.48 లక్షలు కాజేసి ఆ మొత్తానికి నకిలీ ఈ-స్టాంపులు ఇచ్చాడని ఎస్పీ తెలిపారు.