అజాన్ కోసం యాప్.. లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు నేపథ్యంలో..
లౌడ్ స్పీకర్ల సౌండ్ పై మహారాష్ట్రలో ఆంక్షలున్న నేపథ్యంలో మసీదులు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యాయి. అజాన్ (ప్రార్థన కోసం పిలుపు) ను నేరుగా సంబంధికులకు చేరేలా ప్రత్యేకంగా ఆన్ లైన్ అజాన్ అనే మొబైల్ యాప్ తో రిజిస్టరైనట్లు వార్తలొస్తున్నాయి. దీనిని తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సంస్థ అభివృద్ధి చేసింది.
ప్రార్థనల పిలుపు కోసం వాడే లౌడ్ స్పీకర్ల వాడకంపై ఆంక్షలున్నాయి. ప్రార్థన పిలుపును నేరుగా సంబంధిత వ్యక్తులకే చేరడానికి ఉపయోగపుతుంది. లౌడ్ స్పీకర్లకు ఇది ప్రత్యామ్నాయం. ప్రార్థనలు చేసేవారు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా తమకు దగ్గర్లో వున్న మసీదు నుంచి అజాన్ పిలుపు వినడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఇంట్లోనే వుండి అజాన్ వినేలా ఈ ఉచిత యాప్ ను రూపొందించాం. అజాన్ సమయంలో మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా ఆడియోను వినవచ్చు అని మహిమ్ జుమా మజీద్ మేనేజింగ్ ట్రస్టీ ఫహాద్ ఖలీల్ పఠాన్ ప్రకటించారు.
ముఖ్యంగా వృద్ధులు, ప్రార్థనలకు రాలేని వారు అజాన్ వినడానికి ఈ ఆన్ లైన్ అజాన్ యాప్ ను తెచ్చినట్లు తెలుస్తోంది. మసీదులో ఏర్పాటు చేసిన 10x15 బాక్స్ స్పీకర్లు సంప్రదాయకంగా వున్న లౌడ్ స్పీకర్ల మాదిరిగా గట్టిగా వినబడటం లేదని, లౌడ్ స్పీకర్లకే అలవాటుపడిన వారికి చాలా కష్టంగా వుందని ,అందుకే ఈ ఆన్ లైన్ యాప్ తెచ్చినట్లు మసీదు నిర్వాహకులు పేర్కొంటున్నారు.
కేవలం మూడు రోజుల్లోనే మహిమ్ జుమా మసీదు సమీపంలోని 500 మంది ఈ యాప్ లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని మహిమ్ జుమా మజీద్ ట్రస్టీ ఫహాద్ ఖలీల్ వెల్లడించారు. ప్రార్థనల కోసం ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని, వారి ప్రాంతాన్ని లొకేషన్ లో ఎంచుకొని, ఆ తర్వాత తమ సమీపంలోని మసీదును ఎంచుకుంటారని వివరించారు.