గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. అనంతరం వల్లభనేని వంశీని గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో భాగంగానే ఆయన్ను పోలీసులు అరెస్టుచేసినట్లు సమాచారం. మరోవైపు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వంశీని ఏ కేసులో అరెస్టు చేశారనే విషయంపై విజయవాడ వెళ్లిన తరువాత పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.