మోడీ చేతిలో కీలుబొమ్మగా ఎన్నికల కమిషన్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారు రావు
మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిన ఎన్నికల కమిషన్,రాష్ట్రంలో బద్ధ శత్రువులుగా నటిస్తూ కేంద్రంలో ఎన్డీఏ కి మద్దతు ఇస్తున్న టిడిపి వైసిపి పార్టీలు, బిజెపి, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో బలమైన పోరాటాలు నిర్మిస్తాం - సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారు రావు
కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన భవిష్యత్తు పోరాటాలకు వేదికగా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ వేదిక కాబోతున్నదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారు రావు తెలియజేశారు. గురువారం ఉదయం స్థానిక బద్వేల్ పట్టణంలోని ఎన్జీవో హోం నందు నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ప్రధమ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. మొదటగా పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించడం జరిగింది.
మహాసభ వేదికగా ఆయన ప్రసంగిస్తూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ శక్తులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్నదని, కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం మోడీ చేతిలో పావుగా మారిందని ఆయన విమర్శించారు. ఉత్తర భారత దేశంలో జరుగుతున్న ఎన్నికలలో బిజెపి వ్యతిరేక ఓట్లను రద్దు చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఓటర్ జాబితా పరిశీలన చేపట్టిందన్నారు. బిజెపి ప్రభుత్వం దేశ సంపదనంతా అంబానీ అదానిలకు దోచిపెట్టె కుట్రలో భాగమే ఆపరేషన్ కగార్ అని, అక్కడున్న అత్యంత విలువైన 24 రకాల ఖనిజ సంపదను దోపిడీదారుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నదని, ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారని దీనిని ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.